పార్లమెంట్‌లో చర్చకు నేను సిద్ధం: అమిత్‌షా
02:37 pm Aug 12, 2026

పార్లమెంట్‌లో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలనుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు.. 24 గంటల పాటు ప్రతిపక్షాలు ప్రశ్నలు అడగడానికి అందుబాటులో ఉంటానని చెప్పారు. చర్చ జరపాలని ప్రతిపక్షాలు అధికారికంగా లేఖ రాస్తే.. చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

బుధవారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. ‘సమావేశాలు మొదలైన నాటినుంచి పార్లమెంట్‌కు వస్తున్నాను. నా ఛాంబర్‌లో కూర్చుంటున్నాను. పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటుంటే.. ఎవరైనా ఏం చేస్తారు?. వాళ్లు చర్చ జరగడానికి అంగీకరించరు. దీన్ని బట్టి ఎవరు పారిపోతున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారు’ అని అన్నారు.

Advertisement

 

అమిత్‌షా వ్యాఖ్యలకు రాహుల్‌గాంధీ కౌంటర్

అమిత్‌షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘విద్యార్థులపై లాఠీచార్జ్ ఎవరు చేశారు?. కాల్పులకు ఆదేశించింది ఎవరు?. 20 రోజులుగా అమిత్‌షా ఎందుకు మాట్లాడలేదు?. పార్లమెంట్ ముగిసే సమయానికి అమిత్‌షా డ్రామాలు ఆడుతున్నారు’ అంటూ రాహుల్ మండిపడ్డారు

Advertisement
Advertisement