టాటా సన్స్ చైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా
02:40 pm Aug 12, 2026

న్యూఢిల్లీ, ఆగస్టు 12: టాటా సన్స్ చైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. ఈ సంస్థ చైర్మన్ పదవిని తాను మరోసారి కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆగస్టు 18వ తేదీన ఆ సంస్థ సర్వసభ్య సమావేశం జరగనుంది. అందుకు కొద్ది రోజుల ముందు చంద్రశేఖరన్ రాజీనామా చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది. టాటా గ్రూప్‌లో తాను 40 ఏళ్ల పాటు వృత్తి జీవితాన్ని పూర్తి చేసుకున్నానని తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థకు సేవలందించడం ద్వారా సంతృప్తికరమైన అవకాశం లభించిందన్నారు. అందుకు కృతజ్ఞతలు తెలిపారు.

గత దశాబ్ద కాలంగా టాటా సన్స్‌కు నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇది అపారమైన బాధ్యత అని అభివర్ణించారు. వారసత్వంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా టాటా బోర్డుకు ఆయన విజ్ఞప్తి చేశారు. 2027, ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆయన పదవి కాలం ఉంది. కానీ కొన్ని నెలల మందే చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో టాటా సంస్థ షేర్లు దాదాపు 5 శాతం మేర పడిపోయాయి.

Advertisement

 

గతంలో చంద్రశేఖరన్ టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్‌గా పని చేశారు. 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ నియమితులయ్యారు. నాటి నుంచి ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఈ సంస్థ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ను మళ్లీ నియమించడంపై టాటా సన్స్, టాటా ట్రస్ట్ మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారని తెలుస్తోంది. టాటా గ్రూప్ సంస్థలో స్టీల్, మోటర్స్, టీసీఎస్, ఇండియన్ హోటల్స్‌ ఉన్నాయి. ఎన్ చంద్రశేఖరన్ ఇప్పటి వరకు వీటికి చైర్మన్‌గా వ్యవహరించారు.

Advertisement
Advertisement